| గోపి గోపిక
గోదావరి -
పబ్లిక్
టాక్ |
| వేణు, కమలిని ముఖర్జీ ఇతర నటీనటులు -
కృష్ణ భగవాన్, జీవా, కొండవలస, జయలలిత, సన సంగీతం -
చక్రి నిర్మాత -
వల్లూరిపల్లి రమేష్ , కథ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం -
వంశీ,
రిలీజ్ డేట్ -
10 జులై 2009 |
తెలుగువాళ్లకి వంకాయ కూరంటే ఎంత ఇష్టమో వంశీ సినిమా అన్నా అంత ఇష్టం.
విశ్వనాథ్ స్థాయి క్లాసిక్ టచ్ కీ, బాపు స్థాయి భావుకతకీ, చిలిపితనం,
వేగం మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో వంశీ సినిమాలు చూస్తే తెలుస్తుంది.
తరుముకొచ్చే పంచింగ్ డైలాగులు, పరుగులెత్తించే స్ర్కీన్ ప్లే వంశీ ప్లస్
పాయింట్లు. దీనికి తోడు టైటిల్లోనే తొంగి చూసే గోదావరి బ్యాక్ డ్రాప్,
అందమైన హోమ్లీ హీరోయిన్, బెంగాలీ గోపిక కమలిని... సో... వంశీ అభిమానులు
ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకోవడం సహజం. అయితే ఆ ఆశలు ఎంతవరకూ
నెరవేరాయంటే ... చెప్పడం కష్టమే.

కథ
అనగనగా ఒక కమలిని. గోదావరి మీద మొబైల్ హాస్పిటల్ పెట్టి, పేద ప్రజలకి
సాయపడుతుంటుంది. ఆమెని ఇష్టపడ్డ ఓ కుర్ర డాక్టర్ పెళ్లి ప్రపోజల్ తెస్తే
- ఓకే గానీ కొంతకాలం వెయిట్ చేయమంటుంది. ఇంకో పక్క అనగనగా ఒక వేణు.
ఆర్కెస్ట్రా సింగర్. కొంచెం ఎక్స్ ట్రాలు కూడా చేస్తుంటాడు. బాటిల్స్
కొద్దీ మందు తాగుతూ ఇంటికి అమ్మాయిని కూడా తెచ్చుకుంటూ ఉంటాడు. కానీ
చాలా మంచివాడు. ఏ సంబంధం లేకపోయినా మానవత్వంతో ఇతరులకి సాయం చేస్తుంటాడు.
కమలిని ఫ్రెండ్ మరిచిపోయిన ఓ సెల్ ఫోన్ వల్ల కమలినితో వేణుకి ఫోన్లోనే
పరిచయం ఏర్పడుతుంది. ఆ ఫ్రెండ్ తండ్రికి వేణు అండగా నిలుస్తాడు.
నెమ్మదిగా వేణు, కమలిని ఒకరిని ఒకరు చూసుకోకుండా ఫోన్ లోనే
ప్రేమించుకోవడం మొదలుపెడతారు. కానీ వీళ్లు కలుసుకుందామనుకున్నప్పుడల్లా
సిల్లీ కారణాలు ఎదురై, మిస్సవుతుంటారు. ఫోన్లో నే ఫొటోలు పంపించుకోవచ్చు
కదా? అంటే - థ్రిల్ పోతుంది, డైరెక్ట్ గానే కలుద్దామంటుంది కమలిని.
కమలిని ఫోన్ టాక్ లన్నీ తెలిసి కూడా అవన్నీ పెళ్లి కుదిరిన అబ్బాయితోనే
అనుకుని తల్లి జయలలిత సంతోషిస్తూ ఉంటుంది. మొత్తానికి నిజం
తెలిసిపోతుంది. ముందు గొడవ చేసినా, చివరికి మాట్లాడడానికి వేణుని
రమ్మంటుంది. కానీ వచ్చే దారిలో రౌడీలు వేణు తలపగలగొడతారు. వేణు గతం
మరిచిపోతాడు. అనుకోకుండా కమలిని దగ్గరికే పేషెంట్ లా చేరతాడు. అతనే గోపి
అని ఆమెకి తెలియదు. తనే గోపి అని వేణుకీ తెలియదు. వేణు తల్లి గీతాంజలి
కూడా అక్కడే ఉన్నా కొడుకుని చూడలేక అతను చనిపోయాడనే అనుకుంటుంది.
చివరికి ఈ దోబూచులాట అంతా ముగిసి, ఆ గోదావరి తీరంలో గోపి, గోపిక ఎలా
ఏకమయ్యారన్నది మిగిలిన కథ.

యాక్టర్స్
ఏ హీరోకైనా వంశీ సినిమాలో మొదటిసారి చేసేటప్పుడు ఆ డైరెక్టన్ తీరు
వింతగా ఉంటుందంటారు. వేణు వంశీ స్టయిల్లో బాగానే ఇమడగలిగాడు. కానీ
ముఖంలో పలికించే భావాల్లో మరింత మెచ్యూరిటీ అవసరం. మధ్యలో కథ సీరియస్
అయిపోవడంతో తన మార్క్ కామెడీ చేయడానికి వేణుకి పెద్ద అవకాశం రాలేదు. ఇక
కమలిని ... గోదావరిలా చూడగానే రిఫ్రెషింగ్ గా ఉంది. నటనలో సీనియారిటీ,
ఈజ్ కనిపించాయి. వేణు తల్లిగా గీతాంజలి ఓకే. జీవా ఈ సినిమాలో కామెడీ
చేయలేదు. కొండవలస లాయర్ కామెడీ వేస్టయింది. ప్రదీప్ శక్తి గ్యాంగ్
నటించిన మొబైల్ హాస్పిటల్ కామెడీ సీన్లు సినిమాకి వంశీ వాతావరణాన్ని
తీసుకొచ్చాయిగానీ ఆహ్లాదంగా లేవు. అతి, అశ్లీలత కాస్త ఎక్కువైనా -
ఉన్నంతలో కృష్ణ భగవానే నవ్వించాడు.
మ్యూజిక్
చక్రి మ్యూజిక్ ఈ సినిమాలో మంచి రిలీఫ్. రెండు మూడు పాటలు ... ఇళయరాజాని
గుర్తు తెస్తాయి. అందమైన బ్యాక్ గ్రౌండ్, ఆహ్లాదకరమైన పాటలు ఈ సినిమాని
ఎంతవరకూ నిలపగలవో వేచి చూడాలి.

డైరెక్షన్
వంశీకి చాలాకాలం తరవాత హిట్ ఇచ్చి, సెకండ్ ఇన్నింగ్స్ కి అవకాశం
కల్పించిన సినిమా 'ఔను,వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు'. అందుకే దానిమీద
అభిమానంతో అలాంటిదే మరో సినిమా తీయాలనుకున్నాడేమో వంశీ! 'ఔను,వాళ్లిద్దరూ
ఇష్టపడ్డారు' కీ, 'గోపి గోపిక గోదావరి' కీ చాలా పోలికలు కనిపిస్తాయి.
టైటిల్లో మూడు పదాలు ఉండడం కాదు, అసలు కథ బ్యాక్ గ్రౌండ్ లోనే ఆ పోలిక
తెలుస్తుంది. 'ఔను..'లో హీరో హీరోయిన్ కలవకుండానే ప్రేమించుకుంటారు.
ఇక్కడా అంతే. హీరోయిన్ కి ముందే పెళ్లి ఫిక్సవడం, మారుపేరుతో మరో
మనిషిగా పరిచయం కావడం.. ఇలా చూస్తే ఎన్నో... కథ వేరయినా ప్లే ఒకటే.
అయితే అక్కడ ఓ అబ్బాయి, అమ్మాయి ఒకే ఇంట్లో కలిసీ కలవకుండా నివసించడం
మంచి రొమాంటిక్ పాయింట్. ఇక్కడ కలుసుకోకుండా ఉండడంలో అంత రొమాంటిక్ టచ్
లేదు.
ఒకరికొకరు కనిపించకుండా ప్రేమించడం అనేది చాలామంది చాలా సినిమాల్లో
వాడేసిన టెక్నిక్కే. దానికి తోడు సెంటిమెంట్ మిక్స్ చేసి, దోబూచులాట
కోసం గీతాంజలి కారెక్టర్ కి మధ్యలో కళ్లు పోగొట్టడం మినహా కొత్తగా
ఆలోచించిందేమీ లేదనిపిస్తుంది. కాకపోతే ఆహ్లాదకరమైన గోదావరి బ్యాక్
గ్రౌండ్ - ఈ సినిమాకి ఆటోమెటిగ్గా కొంత బలాన్నిచ్చింది.
ఇకపోతే చిలిపి తనానికీ, అశ్లీలతకీ చాలా తేడా ఉంది. అక్రమ సంబంధాలతో
కూడుకున్న ఎడల్ట్ జోక్స్ ని ఎంటర్ టైనింగ్ గా తీయగల వంశీ, కాలం గడిచే
కొద్దీ ఆ సెన్సిటివిటీని కోల్పోతున్నాడేమోననిపిస్తుంది. ఏప్రిల్ 1
విడుదలలో చిన్నారావ్ కారెక్టర్లో మల్లికార్జున రావు చేసే కామెడీలో ఉండే
సున్నితత్వం ఇందులో కనిపించదు. బెడ్రూం సీన్లు, కృష్ణ భగవాన్ పిల్లల
ముదురు డైలాగులు చూస్తే చాలా బాధేస్తుంది. శంకరమంచి కూడా కొన్ని చోట్ల
తన కలాన్ని మరింత అదుపులో పెట్టుకుంటే బాగుండేది.

గోలగోలగా ఉండే దేశవాళీ కళాకారుల వాతావరణాన్ని అద్భుతంగా ఎలివేట్ చేయగల
డైరెక్టర్ వంశీ. ' కనకమాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్' సినిమా
ఇందుకు గొప్ప ఉదాహరణ. ఆర్కెస్ట్రా సింగర్ గా వేణుని చూసినప్పుడు
ఇలాంటివేవో ఉంటాయని వంశీ అభిమానులు ఎంతో ఆశిస్తారు. అక్కడా నిరాశే
ఎదురయింది. ఇక 'ఏప్రిల్ 1 విడుదల' కి రివర్స్ లో కృష్ణ భగవాన్ అన్నీ
అబద్ధాలే చెప్పడం అతిగా అనిపించింది.
చివరిగా...
'సితార', ఒక 'అన్వేషణ', ఒక 'ఏప్రిల్ 1 విడుదల' ... అన్నీ వెరైటీ
చిత్రాలే. వీటిలో వంశీ మార్క్ మాత్రమే కామన్. హిట్టయిన తన పాత చిత్రాల
అనుకరణ జోలికి పోకుండా వంశీ తన మార్క్ తో కొత్త ప్రయోగం చేస్తే
బాగుంటుంది. ఆ కొత్తదనం ఈ సినిమాలో మిస్సయిందనే చెప్పాలి.
పబ్లిక్ టాక్
వంశీ స్టయిల్ డైరెక్షన్ ని, గోదావరి అందాల్ని ఇష్టపడేవాళ్లు, గుర్తు
చేసుకోవాలనుకునేవాళ్లు ఈ సినిమా చూడచ్చు. ఎందుకంటే ముందు అనుకున్నట్టు
- తెలుగువాళ్లకి వంకాయ కూరంటే ఎంత ఇష్టమో వంశీ సినిమా అన్నా అంత ఇష్టం
మరి. వంకాయ కూర ఎప్పుడూ రుచికరమైనదే. కానీ ఫ్రిజ్ లో పెట్టి తీసి వేడి
చేసుకున్నది, తాజా కూర ఉన్నంత బాగుండదు మరి. |